
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఆడిన గత రెండు మ్యాచుల్లో ‘మిస్టరీ’ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తేలిపోయాడు. అతడి బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు దూకుడుగా ఆడి భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ బౌలింగ్ విషయంలో ఇప్పటికే చాలాసార్లు ఓ మాట చెప్పానని తెలిపాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో ‘యాష్ కి బాత్’ చర్చా కార్యక్రమంలో అశ్విన్ మరోసారి పలు సూచనలు చేశాడు.
‘‘వరుణ్ విషయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు పెద్ద చర్చ. ప్రత్యర్థి బ్యాటర్లు అతడిని లక్ష్యంగా చేసుకొని ఎటాకింగ్ చేస్తున్నారా? లేదా వారికి ఛాన్స్ ఇస్తున్నాడా? ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ కూడా గూగ్లీలు వేస్తాడు. రషీద్‌ను మన బ్యాటర్లు బాగానే ఎదుర్కొన్నారు. కానీ, అతడు మరీ ఎక్కువ పరుగులు ఇవ్వలేదు. కానీ, వరుణ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అలాంటప్పుడు వ్యూహాలను మార్చుకోవాలి. లైన్ అండ్ లెంగ్త్‌తోపాటు స్పీడ్ వేరియేషన్స్ చూపించాలి. ఇలాంటప్పుడే వరుణ్‌తో మేనేజ్‌మెంట్ మాట్లాడాలి. బ్యాటర్లు ఎటాకింగ్ చేయగానే అతడిలో విశ్వాసం సన్నగిల్లుతోంది. అయితే, ఎడమచేతివాటం బ్యాటర్లు క్రీజ్‌లో ఉన్నప్పుడు రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేయొద్దని పదేపదే చెప్పి నేను అలసిపోయా’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌పై సెమీస్‌లో వరుణ్ ఏకంగా 64 పరుగులు ఇచ్చాడు.