
దిల్లీ: సినిమా టికెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు (Supreme Court) తాత్కాలికంగా నిలిపివేసింది. టికెట్ రేట్లు పెంచాలంటే చట్టంలో ఉన్న నిబంధన ప్రకారం.. సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం మెమో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రస్తుతానికి టికెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని సూచించింది. దీంతో త్వరలో విడుదల కాబోయే చిత్రాలకు ఊరట లభించింది. ప్రీమియర్స్‌తో పాటు, టికెట్ ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు లభించింది.
ఇదీ జరిగింది..
సంక్రాంతి సందర్భంగా విడుదలైన తెలుగు సినిమాల టికెట్ ధరల పెంచుతూ (ticket worth hike in telangana) రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో టికెట్ ధరలను పెంచరాదంటూ స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విషయంలో ఎలా అనుమతించారని నిలదీసింది. ‘రాజాసాబ్’తో పాటు ఈ సినిమాకూ ఒకే రోజు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమో జారీ చేసినప్పుడు.. ఆ విషయాన్ని కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచొద్దని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసీ ఈ నెల 10న పబ్లిక్ డొమైన్‌లో ‘ధరల పెంపు మెమో’ను పెట్టడంపై సుమోటో కోర్టు ధిక్కరణగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇకపై టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని సినిమా విడుదలకు 90 రోజుల ముందే వెల్లడించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.