
ఆదివారం టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది టీమ్ ఇండియా. ప్రత్యర్థి ప్రమాదకరమే అయినా.. సొంతగడ్డపై.. భారీ అభిమాన సందోహం మధ్య కప్పు గెలవడానికి భారత జట్టుకు మెరుగైన అవకాశాలే ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. ఈ మ్యాచ్ అయ్యాక టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించవచ్చంటూ ప్రచారం సాగుతుండడం విశేషం. దీన్ని కొట్టిపారేయలేం.
సూర్యకుమార్ యాదవ్ వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. అతను ఇప్పటిదాకా టెస్టుల్లో ఒక్కటే మ్యాచ్ ఆడాడు. ఒక రెండేళ్లు వన్డే జట్టులో కొనసాగాడు కానీ.. 2023 ప్రపంచకప్ ఫైనల్లో పేలవ ప్రదర్శన చేయడంతో తర్వాత అతడిపై వేటు పడింది. ఇక అప్పట్నుంచి టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఏడాదిన్నర కిందట వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచాక.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఒకేసారి టీ20 ఫార్మాట్ నుంచి రిటైరయ్యారు. రోహిత్ స్థానంలో టీ20 జట్టు పగ్గాలందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అతడి సారథ్యంలో టీమ్ ఇండియా ఒక్కటంటే ఒక్క సిరీస్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడబోతోంది. ఇందులో గెలిస్తే.. టీమ్ ఇండియాకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా దిగ్గజాల జాబితాలో చేరతాడు సూర్యకుమార్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవ్వడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదు. సూర్యకు వయసు పెరిగింది. ఫామ్ తగ్గింది. కెరీర్ చరమాంకంలోనే ఉన్నాడు కాబట్టి రిటైర్మెంట్‌కు ఇది సరైన సమయమే. ప్రపంచకప్ గెలిచి నిష్క్రమిస్తే కెరీర్‌కు అంతకంటే గొప్ప ముగింపేముంటుంది? కప్పు గెలిస్తే.. రిటైర్మెంట్ ప్రకటించడం అన్నది అతడి ఛాయిస్.
ఓడినా తప్పదు

ఒకవేళ ఇండియా ఫైనల్లో ఓడిపోతే.. సూర్యకు ఛాయిస్ ఉండదు. అతడిపై సెలక్టర్లు వేటు వేసే అవకాశాలే ఎక్కువ. కానీ వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే.. తనే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే కెప్టెన్ అయిన దగ్గర్నుంచి అతడి ఫామ్ ఏమంత గొప్పగా లేదు. సారథి కావడానికి ముందు సూర్య 68 మ్యాచ్‌ల్లో 43.33 సగటుతో 2340 పరుగులు చేశాడు. అందులో 4 శతకాలు కూడా ఉన్నాయి. కానీ కెప్టెన్ అయ్యాక 41 మ్యాచ్‌లు ఆడి 26.62 సగటుతో 932 పరుగులే సాధించాడు. ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. కెప్టెన్ కావడం వల్లే జట్టులో ఉన్నాడు కానీ.. ఇలాంటి ప్రదర్శన చేసిన ఆటగాడిపై వేటు పడేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్య సారథ్యంలో భారత జట్టు వరుసగా సిరీస్‌లు సాధించింది కానీ.. అందులో అతడి ఘనత పెద్దగా లేదనే విమర్శలున్నాయి. కెప్టెన్ సరిగా ఆడనపుడు జట్టు విజయాల్లో ఎక్కువ క్రెడిట్ దక్కకపోవడంలో ఆశ్చర్యమేముంది?
ఘనంగా మొదలుపెట్టాడు కానీ..

ఈ ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్ సిరీస్‌లో సూర్య బాగానే ఆడాడు కానీ.. అంతకుముందు మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో ప్రపంచకప్ జట్టు నుంచే అతణ్ని తప్పించాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ సెలక్టర్లు అంత కఠినంగా వ్యవహరించలేకపోయారు. పైగా కివీస్‌తో సిరీస్‌లో రాణించడంతో విమర్శలకు అడ్డుకట్ట పడింది. ప్రపంచకప్‌ను సూర్య ఘనంగానే ఆరంభించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో అమెరికాతో పోరులో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గట్టెక్కించింది సూర్యనే. కానీ ఆ తర్వాత అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాడు. సూపర్-8లో కీలకమైన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌ల్లో వరుసగా 18, 18 పరుగులే చేశాడు. సెమీస్‌లో 11 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో సూర్యపై మళ్లీ విమర్శలు తప్పలేదు.
మరోవైపు జట్టు ఫైనల్ చేరినా సరే.. టోర్నీలో సూర్య కెప్టెన్సీ విమర్శలకు దారి తీసింది. తుది జట్టు కూర్పు.. మ్యాచ్ వ్యూహాలు విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో అతడి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కాబట్టి ఫైనల్లో ఓడితే మాత్రం సూర్య కెప్టెన్సీ నుంచే కాక జట్టు నుంచి కూడా తప్పించే అవకాశాలున్నాయి. కాబట్టి అంతకంటే ముందు సూర్యనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువ. సూర్య నిష్క్రమిస్తే.. జట్టు పగ్గాలందుకోవడానికి హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. మరి సూర్య నిజంగానే ఆదివారం ఫైనల్ అనంతరం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడా.. అదే నిజమైతే అతను కప్పు గెలిచి సగర్వంగా నిష్క్రమిస్తాడా.. లేక వైఫల్యాన్ని మూటగట్టుకుని భారంగా నిర్ణయాన్ని ప్రకటిస్తాడా? వేచి చూద్దాం మరి.
– ఈనాడు క్రీడావిభాగం