Sree Leela: ఇక డాక్టర్‌ శ్రీలీల.. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన నటి


ఇంటర్నెట్‌ డెస్క్‌: డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన వారు చాలామంది ఉన్నారు. కానీ, నటిగా రాణిస్తూనే శ్రీలీల (Sree Leela) ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తాజాగా వైద్య పట్టా అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అందుకే డాక్టర్‌ కావాలనుకున్నారు..

తమ ఇంట్లో జరిగిన ఓ సంఘటన కారణంగానే డాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నారు శ్రీలీల. ‘‘మా అమ్మమ్మ ఉన్నట్టుండి పడిపోయింది. అప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. వైద్యుడైన మా అన్నయ్య వచ్చి, చిన్నపాటి వైద్యం చేశాక కొన్ని క్షణాల్లోనే ఆమె మామూలు స్థితిలోకి వచ్చింది. వైద్యురాలిని కావాలని అప్పుడే ఫిక్స్‌ అయిపోయా’’ అని ఓ సందర్భంలో తెలిపారు. శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా వైద్యురాలే.

అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చినా.. డాక్టర్‌గా సేవ చేయాలన్న సంకల్పాన్ని వదల్లేదు. వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా చదువుకే కేటాయించేవారు. 2019లో కన్నడ సినిమా ‘కిస్‌’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ‘పెళ్లి సందD’తో 2021లో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. తర్వాత, అగ్ర హీరోల సినిమాల్లో నటించి అనతి కాలంలో స్టార్‌గా మారారు. ఆమె డ్యాన్స్‌కూ ప్రత్యేక అభిమానగణం ఉండటం గమనార్హం. ఇటీవల ‘పరాశక్తి’లో రత్నమాలగా కనిపించిన ఆమె.. పవన్‌ కల్యాణ్‌ సరసన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో నటిస్తున్నారు.