
తిరుమల: సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. ఆలయ మహాద్వారం వద్ద వారికి ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు కుటుంబం స్వయంగా వడ్డించింది. దేవాన్ష్ పేరుతో ఒక్క రోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షల విరాళం అందించారు.
వెంగమాంబ సత్రం నుంచి పద్మావతి వసతిగృహానికి వెళ్తూ సీఎం మధ్యలో ఆగారు. లేపాక్షి కూడలిలో భక్తులతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. భక్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అనంతరం తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు.

