Last Updated:
ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఈ ద్రోణి క్రమంగా చురుకుగా మారుతూ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది . ఈ పరిస్థితుల కారణంగా వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఈ ద్రోణి క్రమంగా చురుకుగా మారుతూ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది . ఈ పరిస్థితుల కారణంగా వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఇటీవల దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరిగిన విషయం తెలిసిందే. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, మరోవైపు సముద్రం నుంచి వచ్చే తేమగాలులు భూ ఉపరితలంపైకి చేరుతున్నాయి. ఈ రెండు పరిస్థితుల కలయికతో వాతావరణంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మార్చి 15న ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.
అదే సమయంలో మార్చి 16 నుంచి ఈ వర్షాల ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్రాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మార్చి 17 నుంచి 20 వరకు పలుచోట్ల ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్పష్టంగా కనిపించే అవకాశముంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అకాల వర్షాలపై వాతావరణ విశ్లేషకులు కూడా ఇదే తరహా అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్చి 16 తర్వాత వాతావరణంలో మరింత మార్పు కనిపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. మార్చి 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. గత నెలలో నమోదైన వర్షాల కంటే ఈసారి కొన్ని ప్రాంతాల్లో మరింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల పెరుగుతున్న ఎండల మధ్య ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించే అవకాశమున్నప్పటికీ, ఉరుములు, గాలులు వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తమ వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
