
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India), ఇంగ్లాండ్ మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా సెమీఫైనల్ 2 జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ శివమ్‌దూబె (Shivam Dube) వేశాడు. ఆ సమయంలో తాను కాస్త భయానికి గురయ్యానని అతడు అన్నాడు.
‘ఓవర్‌లో మొదటి రెండు బంతులు చాలా కీలకమని నాకు తెలుసు. అవే మ్యాచ్ విజేతను నిర్ణయిస్తాయి. అందుకే నేను దాని మీద దృష్టి పెట్టాను. ఆ సమయంలో భయానికి గురయ్యాను. వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో చివరి ఓవర్ బౌలింగ్ వేయడం ఎప్పటికీ ఛాలెంజింగే’ అని శివమ్ దూబె వివరించాడు.
‘బెథెల్ సెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ వేయడం కఠినమని నాకు తెలుసు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని, నా సామర్థ్యాలను విశ్వసించాలని నాకు నేను గట్టిగా అనుకున్నాను. అలాంటి సమయంలో 10 శాతం ప్రదర్శన చేసినా.. అది చాలా మేలు చేస్తుంది’ అని దూబె అన్నాడు.
విజయం కోసం 6 బంతుల్లో 30 పరుగులు ఇంగ్లాండ్‌కు అసరమైన పరిస్థితుల్లో శివమ్ దూబె బౌలింగ్‌కు వచ్చాడు. అదే అతడికి ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్. దూబె ఈ ఓవర్‌లో 22 పరుగులు ఇచ్చాడు. దీంతో టీమ్ఇండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక బ్యాటింగ్‌లో దూబె కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. ఫైనల్‌లోనూ అతడు ఇలాంటి ఇన్నింగ్సే ఆడాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.