
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు దాడులతో విరుచుకుపడ్డాయి. హార్మోజ్గాన్ ప్రావిన్స్ మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 40 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 45 మంది గాయపడినట్లు తెలిపింది. దాడి సమయంలో స్కూల్లో 170 మంది విద్యార్థినులు ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరాన్ పారామిలిటరీ ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్’కు ఈ ప్రాంతంలో స్థావరం ఉంది.
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి తమపై చేస్తున్న యుద్ధం చట్టవిరుద్ధమైనదని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మండిపడ్డారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని ట్రంప్.. ‘ఇజ్రాయెల్ ఫస్ట్’గా మార్చారని విమర్శించారు. దురాక్రమణదారులకు తమ సాయుధ బలగాలు తగిన గుణపాఠం చెబుతాయన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు అలర్ట్
- ఇరాన్‌పై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్, అమెరికాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన దురాక్రమణ చర్యగా పేర్కొంది. సమస్యల పరిష్కారానికి దౌత్య చర్చలు జరపాలని సూచించింది. సంబంధిత దేశాలు వెంటనే దాడులు ఆపాలని ఖతర్, సౌదీ అరేబియాలు డిమాండ్ చేశాయి.
- పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తదుపరి నోటీసులు జారీ చేసేవరకు దుబాయ్, అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయాల కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.