తేల్చి చెప్పిన భక్తులు, తితిదే

శరత్‌బాబు, మౌనిక దంపతులు
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని దర్శనం క్యూలైన్‌లో భక్తురాలికి పాముకాటు వేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కుటుంబం ఓ వీడియోలో ఖండించింది. ఈ ఘటనపై తితిదే సైతం స్పందించింది. క్యూలైన్‌లో పాముకాటు అనేది పూర్తిగా అవాస్తవం అని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన శరత్‌బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి తిరుమలకు వచ్చారు. ట్యాక్సీలో మ్యూజియం సమీపంలోని ఆర్‌బీ సెంటర్‌లోని పార్కింగ్ ప్రాంతానికి చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లారు. ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయానికి లోనై.. ఆ విషయాన్ని భర్తకు చెప్పారు.
శరత్‌బాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడో చిన్నపాము కనిపించింది. వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయగా వారు మౌనికను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పాము కాటు వేయలేదని నిర్ధారించారు. అయినా భక్తురాలి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆమెను తిరుపతిలోని స్విమ్స్‌కు పంపించి, అక్కడా పరీక్షలు చేయించి, ఎలాంటి సమస్య లేదని తెలుసుకున్నారు. సదరు భక్తులు సోమవారం శ్రీవారిని దర్శించుకొని ఇంటికి పయనమయ్యారు. ఈ సందర్భంగా తితిదే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్దేశించిన ప్రాంతాల నుంచే క్యూలైన్‌లోకి వెళ్లాలని, తిరుమల పరిసరాల్లోని నిషేధిత అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని తితిదే భక్తులకు విజ్ఞప్తి చేసింది.