నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికే హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మేఘావృతంక కాగా సాయంత్రం వేళ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
వేసవికాలం వచ్చేసింది. శీతాకాలం ముగియడంతో ఒక్కసారిగా మార్పు వచ్చింది.నిన్న మెున్నటి వరకు మంచుతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు రెండు రోజులుగా సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదివారం తన ప్రతాపం చూపించాడు. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
వాతావరణంలో మార్పులు
మరోవైపు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మధ్య తమిళనాడు, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ఈ ద్రోణి విస్తరించింది. అల్పపీడనం, ద్రోని ప్రభావంతో ఇవాళ మరియు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వేసవికాలం నేపథ్యంలో ఒక వైపు ఎండలు మండిపోతుండగా వాతావరణ కేంద్రం ఒక్కసారిగా వర్ష సూచన వచ్చింది. ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఉదయం నుండి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఉక్కపోత పెరిగే అవకాశం ఉండగా…సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు భారత వాతావరణ కేంద్రం సైతం ఇవాళ తెలంగాణలో పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి మరియు నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ జిల్లాలలో వడగండ్ల వాన
మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వాన కురిసే అవకాశాలు ఉన్నాయి.
రైతులకు కీలక సూచనలు
ఈ అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.పలు ప్రాంతాలలో పంటలు కోత దశలో ఉన్నందున, రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పడం మంచిది అని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.పగలు ఎండ, రాత్రి వేళ చలిగాలులు ఉండటం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పిల్లలు మరియు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి అని వైద్యఆరోగ్య శాఖ అధికారులు సైతం సూచిస్తున్నారు.