Wednesday, February 25, 2026
HomeNewsఈ చిత్రాలు.. ప్రేమికుల రోజు ప్రత్యేకం

ఈ చిత్రాలు.. ప్రేమికుల రోజు ప్రత్యేకం

మైలాంజి

చెన్నై, న్యూస్‌టుడే: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్త చిత్రాలు తెరపైకి రానున్నాయి. విజయ్‌ ఆంటోని సోదరి కుమారుడు అజయ్‌ దీషన్‌ నటించిన ‘పూక్కి’, ఆండ్రియా ప్రధాన పాత్రధారిగా నటించిన అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కా’, శశికుమార్‌ నటించిన ‘మై లార్డ్‌’, కొత్త తారలు నటించిన ‘మైలాంజి’ చిత్రాలూ 13న విడుదల కానున్నాయి. అర్జున్‌ తన కుమార్తె ఐశ్వర్యతో రూపొందించిన ‘సీతా పయనం’ 14న విడుదల కానుంది.

సీతా పయనం

రీ రిలీజ్‌ సందడి..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమ నేపథ్యంతో రూపొందించిన కొత్త సినిమాలు విడుదల కావడం, వాటికి ప్రేమికులు బ్రహ్మరథం పట్టడం ఆనవాయితీ. కొన్నేళ్లుగా బలమైన ప్రేమకథ చిత్రాలు లేకపోవడంతో ప్రేమికుల దినోత్సవానికి ఆ చిత్రాల లోటు కనిపిస్తోంది. దీంతో ప్రేక్షకాదరణ పొందిన అలనాటి చిత్రాలను రీరిలీజ్‌ చేసేందుకు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ మేరకు ప్రస్తుత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మాధవన్, రీమాసేన్‌ నటించిన ‘మిన్నలే’ (2001), సూర్య, త్రిష, లైలా తదితరులు నటించిన ‘మౌనం పేసియదే’ (2002) చిత్రాలు 13న విడుదల కానున్నాయి. కునాల్, సోనాలి బెంద్రే జంటగా నటించిన ‘కాదలర్‌ దినం’(1999) 14న విడుదల కానుంది. విజయ టి.రాజేందర్‌ దర్శకత్వంలో గంగా, నళిని జంటగా నటించిన ‘ఉయిరుల్లవరై ఉష’ (1983) చిత్రం కూడా 13న విడుదల కానుండటం గమనార్హం.

ఉయిరుల్లవరై ఉష

 

కాదలర్‌ దినం


జైలర్‌-2లో ఎస్జే సూర్య

ఎస్జే సూర్య

చెన్నై, న్యూస్‌టుడే: నెల్సన్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ ‘జైలర్‌-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జైలర్‌’లో నటించిన నటీనటులతో పాటు పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు. తమిళ దర్శకనటుడు ఎస్జే సూర్య కూడా నటిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ వెల్లడించారు. సెట్‌లో బంధువులు తరహాలో మాట్లాడుకుంటామని తెలిపారు. తొలి భాగం కన్నా ప్రస్తుత చిత్రంలో తన కథాపాత్రకు నిడివి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.


‘శైలప్పన్‌ సైకిల్‌ మార్ట్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: సుగా దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘శైలప్పన్‌ సైకిల్‌ మార్ట్‌’. లక్ష్మీ క్రియేషన్స్‌ తరఫున ఇసక్కి కార్‌వణ్ణన్‌ నిర్మించిన ఈ చిత్రంలో ఇసక్కి కార్‌వణ్ణన్, ఎం.ఎస్‌.భాస్కర్, ఇళవరసు, మూణార్‌ రమేశ్, దర్శకుడు సుబ్రమణియ శివ తదితరులు ముఖ్య పాత్రధారులుగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. చిత్రీకరణ ముగిసి నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టరును దర్శకుడు వెట్రిమారన్‌ బుధవారం విడుదల చేశారు.


‘బరీడ్‌’ చిత్రీకరణ పూర్తి

సంబరాల్లో చిత్రబృందం

చెన్నై, న్యూస్‌టుడే: ‘వెబ్‌’ చిత్ర దర్శకుడు హారూన్‌ కథ రాసి దర్శకత్వం వహించిన చిత్రం ‘బరీడ్‌’. డ్రీమ్‌ హౌస్, జైన్‌ క్రియేషన్స్‌ పతాకంపై హరూన్, మహేందర్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘8 తోట్టాక్కళ్‌’ కథానాయకుడు వెట్రి ఇందులో ఎన్‌కౌంటర్‌ పోలీసు అధికారిగా నటిస్తుండగా నాయికలుగా తెలుగువారైన అక్షిత, చాందిని తమిళరసన్‌ నటించారు. బాలాజీ శక్తివేల్, సింగం పులి, శరవణ సుబ్బయ్య, కోడంగి వడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఎన్‌కౌంటర్‌ పోలీసు అధికారి ఎదుర్కొనే సమస్యలు, అతని కుటుంబానికి వచ్చే ఇబ్బందులు, ఇతర పరిణామాలు వంటి కథాంశాలతో చిత్రం రూపొందింది. ఇందులోని ఓ పాటను దర్శకుడు అరుణ్‌రాజా కామరాజ్‌ పాడారు. చెన్నై, కోయంబత్తూర్, ఏర్కాడు, కొడైకానల్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేపట్టారు. ప్రస్తుతం చిత్రీకరణ పనులు ముగియడంతో చిత్రబృందం సంబరాలు చేసుకుంది. 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

Tutorial de trading en gate.io on Insurance Agency Lead Scoring